ప్రధాని వాహనం నిలిచిపోవడం బాధాకరం : పవన్

ప్రధానిని గౌరవించడం అంటే దేశాన్ని గౌరవించడమని వ్యాఖ్య

అమరావతి : పంజాబ్ లో నిరసనకారులు ప్రధాని నరేంద్ర మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవడం పట్ల జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. పంజాబ్ రాష్ట్రంలో ప్రధాని మోడీకి ఎదురైన సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు దేశ ప్రధాని వాహనం ముందుకు వెళ్లలేక రోడ్డుపై నిలిచిపోయిన పరిస్థితి అవాంఛనీయమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేయడం ప్రజల హక్కే అయినప్పటికీ, ప్రధాని గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం తగదని హితవు పలికారు. ప్రధానిని గౌరవించడం అంటే జాతిని, దేశాన్ని గౌరవించడమేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అయితే, ఈ దుస్సంఘటన ఉద్దేశపూర్వకంగా చేసినట్టు అనిపించడంలేదని అభిప్రాయపడ్డారు. ప్రధాని అంతటి వ్యక్తి పర్యటనలకు వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ ను కచ్చితంగా పాటించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అన్నారు. ప్రధానమంత్రికి గానీ, అత్యంత బాధ్యతాయుత రాజ్యాంగ పదవుల్లో ఉన్న మరెవరికైనా గానీ ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని కోరుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో సంయమనం పాటించిన ప్రధాని మోడీకి గౌరవపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/