తుమ్మలకు జై కొట్టిన టీడీపీ శ్రేణులు

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో గత ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా టికెట్ దక్కించుకొని గెలిచి తీరాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సైతం వరుసగా కార్యకర్తలతో భేటీ అవ్వడం , సమావేశాలకు హాజరవుతూ బిజీ అవుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు సైతం తుమ్మలకు జై కొడుతూ వస్తున్నారు.

ఇటీవల నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు నిర్వహించిన ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకల్లో తుమ్మల పాల్గొని సందడి చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. తాజాగా మరోసారి టీడీపీ నేతల సమావేశంలో తుమ్మల పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తూరు గ్రామంలో టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తుమ్మలకే తాము మద్దతు ఇస్తామని తెలుగు తమ్ముళ్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో తుమ్మలను ఓడించుకోవడం తమ దురదృష్టమని, ఈ సారి పాలేరులో తుమ్మల పోటీ చేస్తే పార్టీలకతీతంగా గెలిపించుకుంటామంటూ వెల్లడించారు.