తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గులాబీ పార్టీ శ్రీరామ‌ర‌క్షః ఎమ్మెల్సీ క‌విత‌

brs-mlc-kavitha-fire-on-congress-bjp

జ‌గిత్యాల : జ‌గిత్యాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ స‌మ్మేళనంలో ఎమ్మెల్సీ క‌విత పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కెసిఆర్ స్పీడ్‌ను కాంగ్రెస్ నాయ‌కులు అందుకోలేక‌పోతున్నార‌ని, ఆ పార్టీకి జాతీయ ప్ర‌త్యామ్నాయం బిఆర్ఎస్ పార్టీనే అని క‌విత స్ప‌ష్టం చేశారు.

కెసిఆర్ అంటే కాలువ‌లు, చెరువులు, రిజ‌ర్వాయ‌ర్లు అని ఎప్పుడు చెబుతుంటాను.. కానీ కెసిఆర్ అంటే కైండ్ హార్టెడ్, క‌మిటెడ్ రెస్పాన్సిబుల్ లీడ‌ర్ అని క‌విత పేర్కొన్నారు. కెసిఆర్ మ‌మూలు మ‌నిషి కాదు. ఇలాంటి నాయ‌కులు చాలా త‌క్కువ మంది ఉంటారు. మ‌న తెలంగాణ‌కు అలాంటి నాయ‌కుడు దొరికారు. తెలంగాణ ఉద్య‌మం కొనసాగించిన పార్టీనే అధికారంలోకి వ‌చ్చింది అని క‌విత తెలిపారు.

రేప‌ట్నుంచి హైద‌రాబాద్ వేదిక‌గా సీడబ్ల్యూసీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయ‌ని, ఇక గాంధీ ప‌రివారం అంతా ఇక్క‌డికి వ‌స్తోంది అని క‌విత పేర్కొన్నారు. మొన్న ఖ‌ర్గే వ‌చ్చి ఎస్సీ, ఎస్టీ డిక్ల‌రేష‌న్ ఇచ్చారు. మేం వ‌చ్చి పోడు ప‌ట్టాలు ఇస్తామంటున్నారు. అస‌లు వీళ్లు అప్‌డేట్ కారా..? మొన్న‌నే మ‌నం పోడు ప‌ట్టాలు ఇచ్చేశాం. రాహుల్ గాంధీ అప్‌డేట్ లేని ఔట్‌డేటెడ్ నాయ‌కుడు అయిపోయారు. ఆయ‌న‌కు ఆలోచ‌న లేదు. కెసిఆర్ స్పీడ్‌ను అందుకోలేరు. రాహుల్ గాంధీ మోడీని ఆప‌లేక‌పోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయ ప్ర‌త్యామ్నాయం బిఆర్ఎస్ పార్టీనే అని క‌విత స్ప‌ష్టం చేశారు.

కాంగ్రెస్ నాయ‌కులు ఆలోచ‌న లేకుండా మాట్లాడుతున్నార‌ని క‌విత ధ్వ‌జ‌మెత్తారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది. దేశంలో కాంగ్రెస్ పార్టీని తిర‌స్క‌రిస్తున్నారు. అలాంటి పార్టీని జ‌గిత్యాల‌లోనూ ఓడించాలి. తెలంగాణ‌లో ఊహ‌కంద‌ని అభివృద్ధి జ‌రుగుతుంది. దీంతో ప్ర‌తిప‌క్షాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. కాంగ్రెస్ నేత‌ల మాట‌లు విని మోసపోవ‌ద్దు. తెలంగాణ ప్ర‌జ‌ల‌కు గులాబీ పార్టీ శ్రీరామ‌ర‌క్ష‌. కెసిఆర్ ప‌థ‌కాల‌ను దేశ వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని డిమాండ్ ఉంది. కాబ‌ట్టి బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. తెలంగాణ అంటే ఒక‌నాడు విషాద‌గాథ‌… ఇప్పుడు తెలంగాణ అంటే విజ‌య‌గాథ అని క‌విత పేర్కొన్నారు.