IPL 2023: కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ

బాలకృష్ణ మరోసారి హోస్ట్ అవతారమెత్తారు. ఇప్పటికే ఆహా లో అన్ స్టాపబుల్ షో కు హోస్ట్ గా అలరించిన బాలకృష్ణ..తాజాగా IPL 2023 లో కామెంటేటర్ గా ఎంట్రీ ఇచ్చారు. యావత్ క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న IPL సీజన్ 16 మొదలైంది. ఓపెనింగ్ సెర్మనీలో పాపులర్‌ బాలీవుడ్‌ సింగ‌ర్ అర్జిత్ సింగ్ త‌న పాటలతో అభిమానుల్లో ఉత్సాహం నింపగా.. టోల్వుడ్ హాట్ బ్యూటీస్ త‌మ‌న్నా , పుష్ప ఫేమ్ రష్మిక బాలీవుడ్, టాలీవుడ్ సాంగ్స్‌ కు డాన్స్ లతో రచ్చ చేసారు.

అలాగే వెండితెర ఫై అదిరిపోయే డైలాగ్స్ తో అదరగొట్టే బాలకృష్ణ..ఇక ఇప్పుడు IPL సీజన్ లో అదరగొట్టేందుకు ఎంట్రీ ఇచ్చారు. ఐపీఎల్ ఈవెంట్లో బాలయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జై బాలయ్య సాంగ్ తో ఆయనకు తెలుగు కామెంటేటర్స్ స్వాగతం పలికారు. హీరో నందుతో పాటు స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్స్ ఆశిష్ రెడ్డి, కళ్యాణ్ కృష్ణలతో ఆయన ముచ్చటించారు.

క్రికెటర్ గా తన అనుభవాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. స్కూల్ డేస్ లో నేను క్రికెట్ ఆడేవాడిని. కాలేజ్ డేస్ లో అజారుద్దీన్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి మేటి క్రికెటర్స్ తో అనుబంధం ఉందన్నారు. ఇక ఈ ఐపీఎల్ లో తన మద్దతు తెలుగు టీమ్ సన్ రైజర్స్ కే అన్నారు. ఐపీఎల్ కప్ తెలుగువారు గెలుచుకోవాలని కాంక్షించారు. ఇక, భువనేశ్వర్ కుమార్, అదిల్ రషీద్, హ్యారీ బ్రూక్, ఉమ్రాన్ మాలిక్ వంటి సన్ రైజర్స్ ఆటగాళ్లను, సన్ రైజర్స్ హెడ్ కోచ్ బ్రియాన్ లారాలకు బాలయ్య డైలాగును పలికే చాలెంజ్ విసిరారు. అయితే, ఆ ఆటగాళ్లు… బాలకృష్ణ సినీ డైలాగులు పలికేందుకు ఆపసోపాలు పడ్డారు. ఫ్లూటు జింకపిల్ల ముందు ఊదు… సింహం ముందు కాదు అనే డైలాగును భువనేశ్వర్ అతి కష్టమ్మీద పలకగా, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనే డైలాగును పలికేందుకు మిగతా క్రికెటర్లు ఎంతో శ్రమించారు. ఇక ఉమ్రాన్ మాలిక్ దబిడిదుబిడే అంటూ పలికి ఊపిరి పీల్చుకున్నాడు. లారా కొంచెం సులువుగానే డైలాగ్ చెప్పాడు. కాగా, బ్రియాన్ లారా ఆటను తాను ఎంతగానో ఇష్టపడతానని బాలయ్య ఇతర కామెంటర్లకు వివరించారు.

ఇక, వేణుగోపాల్ రావు తొడ కొట్టే ప్రయత్నం చేయగా బాలయ్య తనదైన శైలిలో స్పందించారు. మేం స్టేజిపై తొడ కొట్టీ కొట్టీ కమిలిపోయింది… నువ్వు కొట్టొద్దులే, ఎందుకొచ్చిన బాధ అంటూ చమత్కరించారు. అంతేకాదు, ధోనీ గురించిన ఓ క్విజ్ లో ఒక ప్రశ్న తప్పు అడిగారంటూ బాలయ్య తన స్పోర్ట్ నాలెడ్జ్ ను చాటుకున్నారు.