గాలివానను లెక్క చేయకుండా రైతులకు అండగా నిలిచిన మఠంపల్లి ఎస్సై రవి కుమార్

గాలివానను లెక్క చేయకుండా రైతులకు అండగా నిలిచి మనసున్న మహారాజు అనిపించుకున్నాడు మఠంపల్లి ఎస్సై రవి కుమార్. గత పది రోజులుగా అకాల వర్షాలు రైతులను కన్నీరు పెట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతన్నలను కన్నీరు పెట్టిస్తుంది. ఈరోజు శుక్రవారం కూడా తెలంగాణ లోని పలు జిల్లాల్లో సాయంత్రం ఈదురుగాలులతో వర్షం విరుచుకుపడింది. అలాంటి కష్ట సమయంలో పోలీస్ గా తన మానవత్వం చాటుకున్నారు. అకాల వర్షం నుంచి పంట తడవకుండా కాపాడేందుకు రైతును అండగా నిలిచారు. ఈ ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెంలో చోటుచేసుకుంది.

మఠంపల్లి ఎస్సై రవి కుమార్ తన సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమానికి బందోబస్తు విధులకు వెళ్లారు. కార్యక్రమం పూర్తై తిరిగొస్తుండగా.. అప్పుడే అకాల వర్షం మొదలైంది. రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొంత మంది రైతులు.. కల్లాల్లో తడుస్తున్న మిర్చి పంటను కాపాడుకునేందుకు తాపత్రయపడుతున్నారు. అది గమనించిన ఎస్సై రవి వెంటనే తన వాహనాన్ని రోడ్డు పక్కన ఆపించి అక్కడికి పరుగెత్తారు. కవర్లను (పరదాలు) కప్పడంలో రైతులకు సహాయపడ్డారు.

గాలి వానను సైతం లెక్కచేయకుండా ఎస్సై రవి, ఇతర పోలీసు సిబ్బంది.. మిర్చి పంటపై కవర్లను కప్పారు. గాలికి కొట్టుకుపోకుండా పెద్ద పెద్ద బండరాళ్లను మోసుకొచ్చి వాటిపై ఉంచారు. పోలీసులు చేసిన ఈ పనిని అక్కడే ఉన్న కొంత మంది తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలను చూసి ‘శెభాష్ పోలీస్’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పోలీసుల్లో ఇలాంటి వారు చాల తక్కువ గా ఉంటారని ప్రతి ఒక్కరు అంటున్నారు.