ఉద్యోగులకు ఉచితంగా టీకా..ఇన్ఫోసిస్, యాక్సెంచర్

ఉద్యోగులతో పాటు వారి కుటుంబీకులకు కూడా టీకా

వాషింగ్టన్: తమ ఉద్యోగులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందించాలని నిర్ణయించామని, టీకా నిమిత్తం అయ్యే వ్యయాన్ని తామే భరిస్తామని ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, కన్సల్టింగ్, ఔట్ సోర్సింగ్ సేవల సంస్థ యాక్సెంచర్ ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలూ, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శాఖల్లో పనిచేస్తున్న వారి కోసం టీకా డ్రైవ్ ను సాధ్యమైనంత త్వరగా ప్రారంభిస్తామని పేర్కొన్నాయి.

ఇందుకోసం ఆరోగ్య శాఖతో మాట్లాడనున్నామని, ఉద్యోగులతో పాటు వారి కుటుంబీకులకూ వ్యాక్సిన్ అందించేందుకు ప్రయత్నిస్తామని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యాక్సెంచర్యా సైతం ఇదే విధమైన ప్రకటన చేసింది. ఉద్యోగులు, వారి ఇంట్లోని అర్హులైన వారికి వ్యాక్సిన్ సరఫరా చేస్తామని తెలిపింది.

కాగా, ఇండియాలో వ్యాక్సినేషన్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టీకాను ఇస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒక్కో డోస్ కు రూ. 250పై వ్యాక్సిన్ అందుతోంది. ఇప్పటికే వాహన సంస్థ మహీంద్రా గ్రూపుతో పాటు ఐటీసీ తదితర సంస్థలు తమ ఉద్యోగులకు టీకాను ఇప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/