గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లు ఎదురుచూడాల్సిందే..

పరిష్కారం కోసం సెనేటర్లు కలిసి రావాలన్న మైక్ లీ

గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లు ఎదురుచూడాల్సిందే..
green card

వాషింగ్టన్‌: అమెరికాలో శాశ్వత నివాసానికి అవసరమైన గ్రీన్‌కార్డు పొందేందుకు 195 ఏళ్లకు పైగా నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందని అమెరికా సెనేటర్ మైక్ లీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయులకు గ్రీన్ కార్డు రావాలంటే 195 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి ఉంటుందని అన్నారు. భారత్ నుంచి వచ్చేవాళ్లు ఎవరైనా గ్రీన్ కార్డు కోరుతూ బ్యాక్ లాగ్ వెయిటింగ్ లిస్టులో చేరితే వారు ఆశలు వదులుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

గ్రీన్ కార్డు వెయిటింగ్ లిస్టులో ఉన్నవారి కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తుండడంతో వారు తమ వలస హోదాను కూడా కోల్పోతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయని మరో సెనేటర్ డిక్ డర్బిన్ అభిప్రాయపడ్డారు. డర్బిన్ వ్యాఖ్యలపై మైక్ లీ స్పందిస్తూ, ఈ సమస్యకు చట్టబద్ధమైన రీతిలో పరిష్కారం కనుగొనేందుకు కలిసి రావాలని ఇతర సెనేటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రీన్ కార్డు దరఖాస్తుదారుడు మరణించిన సందర్భాల్లో వారి సంతానానికి ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ విధానం ఏ విధంగానూ ఉపయోగపడడంలేదని అన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/