తెరుచుకోని ప్యారాచ్యూట్‌..ఏపీ నేవీ కమాండో మృతి

మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకు దూకే క్రమంలో ప్యారాచ్యూట్‌ తెరుచుకోకపోవడం తో ఇండియన్ నేవీ మెరైన్ కమాండో ఒకరు కన్నుమూశారు. శిక్షణా కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. విజయనగం జిల్లా చీపురుపల్లి మండలం పర్లకు చెందిన గోవింద్.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాలోని పనాగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో పారాట్రూపర్స్ ట్రైనింగ్ టీమ్‌లో కమాండో గా విధులు నిర్వహిస్తున్నాడు.

శిక్షణలో భాగంగా ఆయన ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి కిందకి దూకారు. అయితే వందల అడుగుల ఎత్తులో ఉండగా ఆయన ప్యారాచ్యూట్‌ తెరుచుకోలేదు. అలా అంత ఎత్తు నుంచి కిందపడి తీవ్ర గాయాలపాలైయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న కమాండో గోవింద్‌ను వెంటనే బార్జోరా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. విశాఖపట్నం తీరంలో మొహరించిన ఐఎన్‌ఎస్ కర్ణ (INS Karna) నౌకలో ప్రత్యేక దళం ‘నేవీ మెరైన్ కమాండోస్ (Marcos)’కు గోవింద్‌ను అటాచ్ చేసినట్లు తూర్పు నౌకాదళం తెలిపింది. బుధవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని బంకురా జిల్లాలోని బార్జోరాలో ఒక ఫ్యాక్టరీ గేటు వెలుపల గోధుమ రంగు జంప్‌ సూట్, హెల్మెట్‌లో గోవింద్ కనిపించారు. ఆయన తన భుజాలకు పారాచ్యూట్ ధరించి ఉన్నారు. అది పూర్తిగా తెరచుకోలేదని అధికారులు తెలిపారు.