వడ్డీరేట్లు యథాతథం..ఆర్‌బీఐ

6.5 శాతం దగ్గరే కొనసాగింపు

rbi-mpc-presses-the-pause-after-six-repo-rate-hikes-in-a-row

న్యూఢిల్లీః రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ విడత వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగించింది. రివర్స్ రెపో రేటు ఇంతకు ముందు మాదిరే 3.35 శాతంగా కొనసాగుతుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 6.75 శాతంగా ఉంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి సమీక్ష ముగిసిన అనంతరం ఆర్ బీఐ గవర్నర్ ఎంపీసీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.

దేశీయంగా ద్రవ్యోల్బణం ఆర్ బీఐ గరిష్ట పరిమితి 6 శాతాన్ని మించిపోవడం, అంతర్జాతీయంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో.. ఆర్ బీఐ గతేడాది మే నుంచి రెపో రేటును పెంచుతూ వస్తోంది. ఇప్పటి వరకు 2.5 శాతం మేర పెంచగా, తాజా సమీక్షలో యథాతథ స్థితిని కొనసాగించింది. గతంలో పెంచిన రేట్ల ప్రభావం ఇంకా పూర్తి స్థాయిలో కనిపించనందున, కొంత సమయం ఇచ్చి వేచి చూడడం సరైనదిగా ఆర్ బీఐ ఎంపీసీ భావించింది. నిజానికి ఎక్కువ మంది అనలిస్టులు పావు శాతం రేటు పెంపు ఉంటుందని అంచనా వేయగా, తాజా నిర్ణయం వారిని ఆశ్చర్యపరిచేదే. మధ్య నుంచి దీర్ఘకాలానికి ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలన్నది ఆర్ బీఐ లక్ష్యం. కానీ, ఫిబ్రవరి నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.44 శాతంగా ఉంది. అయినా కానీ, ఆర్ బీఐ రేట్ల పెంపు నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ద్రవ్యోల్బణం ప్రతికూల పరిస్థితుల్లో కనిష్టంగా 2 శాతం, గరిష్టంగా 6 శాతం మించకూడదన్నది ఆర్ బీఐ అనుసరిస్తున్న విధానం.

‘‘సరఫరా పరిస్థితులు మెరుగుపడుతుండడంతో 2023 సంవత్సరం భరోసాతో మొదలైంది. ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక మార్కెట్లలో ఆశావాదం బలంగా ఉంది. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాంకింగ్ రంగం నుంచి వస్తున్న ఎదురుగాలులతో ప్రపంచం ఇప్పుడు కొత్త అస్థిరతలను చూస్తోంది’’అని ఆర్ బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. రేట్లను పెంచకూడదన్న నిర్ణయం ప్రస్తుత సమీక్షకే పరిమితమని స్పష్టం చేశారు. తద్వారా అవసరమైతే భవిష్యత్తులో రేట్ల పెంపు ఉండొచ్చన్న సంకేతాన్నిచ్చారు. ఆర్ బీఐ గతేడాది నుంచి రెపో రేటుని 2.5 శాతం మేర పెంచింది. దీంతో అన్ని రకాల రుణాలు ఈ మేరకు భారమయ్యాయి. తాజాగా పెంపు లేకపోవడం రుణ గ్రహీతలకు కాస్తంత ఉపశమనం కల్పించనుంది.