హరిరామ జోగయ్య ఆరోగ్యంపై పవన్ కళ్యాణ్ ఆందోళన

అమరణ దీక్ష చేస్తున్న హరిరామ జోగయ్య తో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య (85 ) అమరణ దీక్ష కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కాపులకు 5% రిజర్వేషన్లు ప్రభుత్వం కల్పించాలని..లేని పక్షంలో అమరణ దీక్ష చేస్తానని హరిరామ జోగయ్య హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీలోపు స్పష్టత ఇవ్వాలని జోగయ్య అల్టిమేట్ జారీ చేసారు. ఆ గడువు ముగిసిన నేపథ్యంలో హరి రామ జోగయ్య నిన్న రాత్రి నుంచి దీక్ష మొదలుపెట్టారు.

దీంతో పోలీసులు ఆయన దీక్ష ను భగ్నం చేసి.. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ జోగయ్య ఎక్కడ తగ్గకుండా ప్రభుత్వాస్పత్రిలో దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫోన్‌లో మాట్లాడారు. అలాగే వైద్యులతో మాట్లాడి హరిరామ జోగయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. హరిరామ జోగయ్య దీక్షపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం హరిరామ జోగయ్య 85 ఏళ్ల వయసులో అమరణ దీక్ష చేపట్టారని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించి చర్చలు జరపాలని కోరారు.