బంగాళాఖాతంలో చిక్కుకుపోయిన మత్స్యకారులు.. 30 గంటలు శ్రమించి ఒడ్డుకు చేర్చిన నేవీ

Indian Navy Rescues 36 Fishermen Stranded In Bay Of Bengal

చెన్నైః బంగాళాఖాతంలో చేపలవేటకు వెళ్లి నడిసముద్రంలో చిక్కుకుపోయిన 36 మంది మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు భారత నావికాదళం తెలిపింది. వారందరినీ భారత నావికాదళ నౌక ఖంజర్ ద్వారా సురక్షితంగా ఒడ్డుకు చేర్చినట్లు తెలిపింది. తమిళనాడు నాగపట్నం తీరం నుంచి 36 మంది మత్స్యకారులు మూడు పడవల్లో చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. అయితే సముద్రంలోకి వెళ్లిన తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలింకపోవడంతోపాటు అందులో ఇంధనం అయిపోవడం, ఇంజిన్ లో సమస్యలు తలెత్తాయి. దీంతో వీరి పడవలు మూడు రోజులుగా తమిళనాడు తీరానికి 130 నాటికల్ మైళ్ల దూరంలో నడిసంద్రంలోనే నిలిచిపోయాయి.

మత్స్యకారులు సముద్రంలో చిక్కుకుపోయిన సమాచారం తెలుసుకున్న భారత నేవీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. బంగాళాఖాతంలో విధుల్లో ఉన్న ఎన్ఐఎస్ ఖంజర్ ను సహాయక చర్యలకు పంపింది. ఈ క్రమంలో నౌకాదళం సిబ్బంది మూడు పడవలను గుర్తించింది. ఆ మూడు బోట్లకు తాళ్లు కట్టి సుమారు 30 గంటలకు పైగా లాక్కుంటూ చెన్నై హార్బర్ తీరానికి తీసుకొచ్చినట్లు నేవీ ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వల్ తెలిపారు.