అవినాశ్ రెడ్డి ఏ తప్పు చేయలేదుః విమలారెడ్డి

అవినాశ్ ను సునీత ఎందుకు టార్గెట్ చేస్తోందో తెలియడం లేదన్న విమలారెడ్డి

jagan-aunt-vimala-reddy-press-meet

అమరావతిః కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లిని ముఖ్యమంత్రి జగన్ మేనత్త విమలారెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ అవినాశ్ తల్లి ఆరోగ్యం నిన్నటి కంటే మెరుగ్గా ఉందని చెప్పారు. ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఒకవైపు భర్త జైల్లో ఉన్నాడు, మరోవైపు కొడుకుని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఆమె తల్లడిల్లిపోతోందని అన్నారు. ఆమె కోసం ప్రార్థన చేయడానికి ఆసుపత్రికి వచ్చానని చెప్పారు.

అవినాశ్ తల్లి ప్రార్థనలు ఎక్కువగా చేస్తుందని, ఉపవాసాలు ఎక్కువగా ఉంటుందని అన్నారు. కొన్ని రోజుల క్రితం తాను ఆమెతో ఫోన్ లో మాట్లాడానని… ఎక్కువగా ఉపవాసాలు చేస్తే అన్న (అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డి) జైలు నుంచి బయటకు వచ్చే సమయానికి నీవు బెడ్ మీద ఉంటావని చెప్పానని, ఉపవాసాలు ఎక్కువగా చేయవద్దని చెప్పానని అన్నారు. నీవు ఉపవాసాలు చేయకున్నా, నీ ప్రార్థనలను దేవుడు ఆలకిస్తాడని చెప్పానని, అయినా వినకుండా ఉపవాసాలు చేసిందని, దీంతో బీపీ బాగా తగ్గిపోయి గుండె మీద ప్రభావం పడిందని చెప్పారు.

ప్రస్తుతం ఆమె ద్రవ పదార్థాల మీదే ఆధారపడి ఉందని, సెలైన్ ఎక్కిస్తున్నారని ఆహారం తీసుకునేంత వరకు ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయరనే అనుకుంటున్నానని అన్నారు. ఆమె చావు వరకు వెళ్లి బయటపడిందని తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం తనకు ఎక్కువగా తెలియదని చెప్పారు.

అవినాశ్ ను సీబీఐ టార్గెట్ చేస్తోందని చెపుతున్నారని విమలారెడ్డి అన్నారు. దేవుడు ఎప్పుడూ అన్యాయం చేయడని చెప్పారు. అవినాశ్ ఏ తప్పు చేయలేదని… అది అవినాశ్ ముఖంలో తనకు కనిపించిందని అన్నారు. ఆసుపత్రిలో తాను అవినాశ్ తో మాట్లాడానని… అత్తా నేను ఏ తప్పు చేయలేదని అవినాశ్ తనతో చెప్పాడని, దేవుడి మీద నమ్మకం ఉందని అన్నాడని తెలిపారు. ఆలస్యమైనా చివరకు న్యాయమే గెలుస్తుందని ఆమె అన్నారు. వైఎస్ వివేకా చాలా మంచి వ్యక్తి అని, జీవించినంత కాలం మంచి పేరుతో జీవించాడని, ఆయన పేరును చెడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వివేకా కూతురు సునీత గురించి మాట్లాడుతూ… దుష్ట శక్తులు ఆమెపై ప్రభావం చూపిస్తున్నాయని తనకు అనిపిస్తోందని అన్నారు. నీవు చేస్తున్నది కరెక్ట్ కాదని సునీతకు ఇటీవల తాను చెప్పానని, అప్పటి నుంచి ఆమె తనతో మాట్లాడటం మానేసిందని చెప్పారు. తొలుత వివేకా హత్య విషయంలో మౌనంగా ఉన్న సునీత… ఇప్పుడు అవినాశ్ ను ఎందుకు టార్గెట్ చేస్తోందో అర్థం కావడం లేదని అన్నారు. వివేకాను హత్య చేసిన వారు బయట తిరుగుతున్నారని… ఏ తప్పు చేయని వాళ్లు జైల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్న రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అంతా సంతోషంగా ఉండేదని, ఎలాంటి ఇబ్బందులు లేవని… ఇప్పుడు ఇన్ని బాధలు ఎందుకు వస్తున్నాయో అని ఆవేదన వ్యక్తం చేశారు.