విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం

వాల్తేరు డివిజన్‌ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్
కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపుల పెంపు

న్యూఢిల్లీ: ఎట్టకేలకు విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేర్ డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యసభలో నిన్న బీజేపీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు మంత్రి పై సమాధానం ఇచ్చారు. జోన్ ఏర్పాటు కోసం డీపీఆర్‌పై వచ్చిన సూచనలు, సలహాల పరిశీలన కోసం సీనియర్ అధికారులతో కమిటీ వేసినట్టు మంత్రి తెలిపారు.

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు డీపీఆర్ సమర్పించిన తర్వాత కొత్త రైల్వే జోన్, రాయగడ రైల్వే డివిజన్ ఏర్పాటు పరిధి, ఇతర అంశాలకు సంబంధించి పలు విషయాలు తమ దృష్టికి వచ్చాయన్నారు. దీంతో ఈ అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం ఉన్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే పునర్విభజన చేపట్టి విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రం కొత్త డివిజన్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్టు మంత్రి తెలిపారు.

అలాగే, బీజేపీ మరో సభ్యుడు టీజీ వెంకటేశ్ అడిగిన మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ 2013-14లో రూ.110 కోట్లతో మంజూరు చేసిన కర్నూలు కోచ్ మిడ్‌లైఫ్ రిహాబిలిటేషన్ వర్క్‌షాప్ కేటాయింపులను తాజాగా రూ. 560.72 కోట్లకు పెంచినట్టు వివరించారు. అలాగే, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ. 178.35 కోట్లు కేటాయించగా రూ. 171.2 కోట్లు ఖర్చు చేసినట్టు మంత్రి తెలిపారు. అలాగే, ఏడు ఎకరాల భూ సేకరణలో తెలంగాణ ప్రభుత్వం ఆలస్యం చేయడం వల్లే ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/