తనను రాజకీయ విధుల నుంచి రిలీవ్ చేయాలని నడ్డాను కోరిన గౌతం గంభీర్

Gautam Gambhir
Gautam Gambhir

న్యూఢిల్లీః టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతం గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాజకీయాల నుంచి వైదొలగి క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ రోజు ప్రకటించాడు.

మార్చి 2019లో బిజెపిలో చేరిన గంభీర్ ప్రస్తుతం ఈస్ట్ ఢిల్లీ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ ఎన్నికల్లో ఏకంగా 6.95 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించిన గంభీర్ అనతికాలంలో బిజెపిలో ప్రముఖ వ్యక్తిగా మారాడు. తాజాగా రాజకీయాలకు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నాడు.

రాజకీయ విధుల నుంచి తనను రిలీవ్ చేయాలని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కోరినట్టు ‘ఎక్స్’ ద్వారా వెల్లడించాడు. ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలపుకొంటున్నట్టు పేర్కొన్నాడు. అయితే, గంభీర్ బిజెపికి రాంరాం చెప్పడం వెనక మరో కారణం కూడా ఉందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కే అవకాశం లేదని, అందుకనే అతడీ నిర్ణయం తీసుకున్నాడని చెబుతున్నారు.