ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని మోడీ

గ్లాస్గో: సోమవారం గ్లాస్గోలో జరిగిన కాప్‌ 26 ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కర్బన తటస్థత (నెట్‌ జీరో) లక్ష్యాన్ని భారత్‌ 2070 నాటికి సాధిస్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. 2030 నాటికి 50 శాతం ఇంధన అవసరాలకు పునరుత్పాదక వనరులపైనే ఆధారపడుతుందని తెలిపారు. ఈ రెండింటితో పాటు భారత్‌ తరఫున 5 వాగ్దానాలు చేశారు. ఈ హామీలను ‘పంచామృతం’గా అభివర్ణించారు. భారత్‌ తన శిలాజయేతర ఇంధన సామర్థ్యాన్ని 2030 నాటికి 500 జీడబ్ల్యూకి తెస్తుందన్నారు.

అదే సమయానికి పారిశ్రామిక కర్బన తీవ్రతను 45 శాతానికి తగ్గిస్తుందని చెప్పారు. అలాగే 2030 నాటికి విడుదలవుతాయని అంచనా వేసిన కర్బన ఉద్గారాల్లో 100 కోట్ల టన్నులు తగ్గిస్తుందని తెలిపారు. భారత్‌ జనాభా ప్రపంచ జనాభాలో 17 శాతమని, మొత్తం (గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌) ఉద్గారాల్లో భారత్‌ వాటా 5 శాతం మాత్రమేనని చెప్పారు. వాతావరణం విషయంలో అభివృద్ధి చెందిన దేశాలు తమ హామీలను నిలబెట్టుకోవాలని హితవు పలికారు. పారిస్‌ డిక్లరేషన్‌ మేరకు లక్ష్యాలను సాధిస్తున్న దేశం భారత్‌ ఒక్కటేనని చెప్పారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/