రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-21 ఫైటర్ జెట్..

భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో క్రాష్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఎయిర్‌ క్రాఫ్ట్‌ పైలట్‌ వింగ్‌ కమాండర్‌ హర్షిత్‌ సిన్హా మృతిచెందాడు. రీసెంట్ గా భారత సైన్యానికి చెందిన ఎంఐ 17 వీ5 ఆర్మీ హెలికాప్టర్‌ కోయంబత్తూరులోని కూనూర్ సమీపంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రివిద దళాల అధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ , ఆయన భార్య మధులిక రావత్ సహా మరో 12 మంది మృతి చెందారు. ఈ ఘటనపై దేశం మొత్తం దిగ్భ్రాంతికి లోనైంది. ఈ ఘటన ను ఇంకా దేశ ప్రజలు మరచిపోకముందే..ఇప్పుడు భారత వైమానిక దళానికి చెందిన మిగ్‌-21 ఫైటర్‌ జెట్‌ కుప్పకూలడం మరింత షాక్ కు గురి చేస్తుంది.

ఈ మేరకు భారత వైమానిక దళం శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. బార్మర్‌లో శిక్షణ సమయంలో వైమానిక దళానికి చెందిన మిగ్ -21 బైసన్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు ట్విట్ ద్వారా వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఐఏఎఫ్ వెల్లడించింది. సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెసర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వైమానిక దళానికి చెందిన విమానం ప్రమాదానికి గురికావడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా మిగ్-21 విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి. ఈ సంవత్సరం ఐదు మిగ్ విమానాలు ప్రమాదాల బారిన పడ్డాయి.