తీన్మార్ మల్లన్నపై కత్తితో దాడి..

బిజెపి నేత , క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న ఫై కత్తి తో దాడి చేశారు. శుక్రవారం రాత్రి ‘శనార్తి తెలంగాణ’ ఆఫీసులోకి సుమారు 20 మంది చొరబడి మల్లన్నతో గొడవకు దిగి ఆయనపై దాడి చేసారు. కత్తులతో అతడ్ని గాయపరచబోయారు. ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. అడ్డుకోవాలనుకునే వారిని తీవ్ర పదజాలంతో తిట్టారు. ఆ తర్వాత ఈ దాడికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా మల్లన్న మీడియాకు విడుదల చేశారు. ‘అభివృద్ధి ఎక్కడ జరిగింది?’ అంటూ శుక్రవారం శనార్తి తెలంగాణ, క్యూ న్యూస్ లో ఆన్​లైన్​ పోలింగ్​ పెట్టారు. దీన్ని కేటీఆర్​ ట్వీట్​ చేస్తూ.. నిస్సిగ్గుగా ఎదుటివారిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్​ ట్వీట్​ చేసిన తర్వాతే తన ఆఫీసుపై దాడి జరిగిందని, పథకం ప్రకారమే దాడులు చేస్తున్నారని మల్లన్నఓ వీడియో విడుదల చేసారు.

టీఆర్ఎస్ పార్టీ గూండాలే ఈ పని చేశారని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఈ దాడిపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఛానల్‌ ద్వారా నిజాలను వెల్లడిస్తున్నానని, దానిని జీర్ణించుకోలేకనే ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. వచ్చిన వారు గూండాలనుకోలేదని వారిని కూర్చోమని మర్యాదలు కూడా చేశామని చెప్పారు. తమ ఆఫీస్‌పై దుండగులు దాడిక పాల్పడుతున్నారని మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదని, ఇప్పటికైనా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని భౌతిక దాడులు జరిగినా భయపడేదేమి లేదని.. వెనక్కి తగ్గేది లేదని మల్లన్న ప్రకటించారు.