జీ20లో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం

India PM Modi Invites African Union To Formally Join G20

న్యూఢిల్లీః జీ20 సదస్సు లో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇచ్చారు. నేడు భారత్‌ మండపంలో జరిగిన వన్‌ ఎర్త్‌ సెషన్‌ ప్రారంభోపన్యాసంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రతిపాదించారు. అందరు సభ్యుల అంగీకారంతో ఆఫ్రికన్‌ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఆఫ్రికన్‌ యూనియన్‌ అధినేతను శాశ్వత సభ్యులకు కేటాయించిన కుర్చీలో కూర్చోబెట్టారు.

‘‘ సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌ మంత్రంతో మనందరం కలిసి ప్రపంచంలో నెలకొన్న అపనమ్మకాన్ని పారదోలుదాము. ప్రపంచంలో పేద, సంపన్న దేశాల మధ్య భేదాలు, ఆహారం, ఇంధనం నిర్వహణ, హెల్త్‌, ఎనర్జీ, నీటి భద్రత వంటి సమస్యలకు సమాధానం కోసం ముందుకు వెళ్లాల్సిందే. భారత్‌ జీ20 అధ్యక్షతన దేశం లోపల, బయట అందరిని కలుపుకొని పోవడానికి ప్రతీకగా నిలిచింది. సబ్‌కా సాథ్‌ భావనతోనే ఆఫ్రికన్‌ యూనియన్‌కు జీ20 సభ్యత్వం ఇవ్వాలని భారత్‌ ప్రతిపాదిస్తోంది. ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరిస్తారని నమ్ముతున్నాను. మీ అనుమతితో జీ20 సభ్యుడి హోదాలో ఆఫ్రికన్‌ యూనియన్‌ అధ్యక్షుడు గ్రూపులో స్థానాన్ని స్వీకరించాలని ఆహ్వానిస్తున్నాను’’ అని తెలిపారు.

ఇదిలా ఉండగా.. గ‌త కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పు గురించి తీవ్ర స్థాయిలో చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. జీ20 సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందు ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియా’కు బదులు.. ‘ప్రెసిడెంట్‌ ఆఫ్‌ భారత్‌’ అని ఉండటంతో ఈ అంశం కాస్తా చర్చీనీయాంశమైంది. తాజాగా జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ కూర్చున్న కుర్చీ వద్ద టేబుల్‌పై ఉండే దేశం నేమ్‌ప్లేట్‌పై ఇండియాకు బదులు భారత్‌ అని రాసి ఉంది. ఇప్పటి వ‌ర‌కు అంత‌ర్జాతీయంగా భార‌త్‌ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంత‌ర్జాతీయ స‌మావేశంలో ఇండియాను భార‌త్‌గా గుర్తిస్తూ.. రౌండ్‌టేబుల్‌పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. జీ20 ప్రతినిధుల‌ను ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ప్రసంగిస్తున్న చైర్ వ‌ద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌లో భార‌త్ అని రాసి ఉంది. మోడీ త‌న ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. భార‌త్ మిమ్మల్ని స్వాగ‌తిస్తోంద‌న్నారు.