సుప్రీంకోర్టు మొట్టమొదటి మ‌హిళా న్యాయ‌మూర్తి క‌న్నుమూత‌

కేరళలోని కొల్లాంలో తుదిశ్వాస విడిచిన జస్టిస్ ఫాతిమా బీవీ

India first woman Supreme Court judge, Justice Fathima Beevi, dies at 96

న్యూఢిల్లీః భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చరిత్రలో మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ కన్నుమూశారు. కేరళలోని కొల్లాంలో ఆమె ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఫాతిమా బీవీ వయసు 96 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె కొన్నిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సుప్రీంకోర్టు జడ్జిగా పదవీ విరమణ చేశాక కేరళలోని పత్తంనతిట్టలో నివాసం ఉంటున్నారు. ఫాతిమా బీవీ సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జి మాత్రమే కాదు, జాతీయ మానవ హక్కుల కమిషన్ మొట్టమొదటి చైర్ పర్సన్ కూడా. అంతేకాదు, ముస్లిం వర్గం నుంచి గవర్నర్ గా నియమితురాలైన తొలి మహిళ కూడా ఆమే. జస్టిస్ ఫాతిమా బీవీ గతంలో తమిళనాడుకు గవర్నర్ గా వ్యవహరించారు.

దేశ న్యాయ వ్యవస్థల్లో వివిధ స్థాయిల్లో పనిచేసిన ఫాతిమా బీవీ 1989లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1992లో పదవీ విరమణ చేశారు. అంతకుముందు ఆమె ఇన్ కమ్ ట్యాక్స్ అప్పిల్లేట్ ట్రైబ్యునలర్ లో జ్యుడిషియల్ మెంబర్ గానూ వ్యవహరించారు.