తెలంగాణ సంపదను మేం పెంచే ప్రయత్నం చేస్తే..కాంగ్రెస్ తుంచే ప్రయత్నం చేస్తోందిః సిఎం కెసిఆర్‌

మీరు వంట చేసి పెట్టండి.. మేం వడ్డిస్తామన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందని ఆగ్రహం

CM KCR Public Meeting at Maheshwaram

మహేశ్వరంః తెలంగాణ సంపదను మేం పెంచితే కాంగ్రెస్ తుంచే ప్రయత్నం చేస్తోందని ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ తీరు ఎలా ఉందంటే… మీరు వంట చేసి పెట్టండి… మేం వడ్డిస్తామన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రంలో సంపద పెరిగేలా చూశామని, కానీ దానిని కాంగ్రెస్ తుంచే ప్రయత్నాలు చేస్తోందని దుయ్యబట్టారు. మేం మూడోసారి అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచుతామన్నారు. ఓటు అనే అస్త్రాన్ని జాగ్రత్తగా ఆలోచించి వేయాలని కోరారు. మీ ఓటు అయిదేళ్ల రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు.

కందుకూరులో మెడికల్ కాలేజీ రావడానికి, నాలాల అభివృద్ధి జరగడానికి సబితా ఇంద్రారెడ్డి కృషే కారణమన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ త్వరలో పైప్ లైన్ రానుందని, అది అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రజలకు తాగునీటి సమస్య ఉండదని చెప్పారు. ఫాక్స్ కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. తాము అధికారంలోకి వచ్చాక 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. రైతుబంధు పథకాన్ని పుట్టించిదే కెసిఆర్ అని, కానీ ఈ పథకాన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం దుబారా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణిని తీసేసి కాంగ్రెస్ పార్టీ భూమాత తీసుకువస్తే అది భూమేత అవుతుందని ఎద్దేవా చేశారు.