స్వీట్లు పంచుకున్న బీఎస్ఎఫ్, పాక్ సైనికులు

జమ్మూ రీజియన్ వ్యాప్తంగా ఇదే వాతావరణం

india-and-pakistan-soldiers-exchange-sweets-on-diwali-along-international-border

న్యూఢిల్లీ : దీపావళి పండుగ సందర్భంగా భారత్, పాకిస్థాన్ దేశాల సైనికులు ప్రేమతో మిఠాయిలు పంచుకున్నారు. సోమవారం జమ్మూ రీజియన్ పరిధిలో ఇరు దేశాల మధ్య 198 కిలోమీటర్ల పొడవునా ఇదే వాతావరణం నెలకొంది. ‘‘దీపావళి పర్వదినం సందర్భంగా జమ్మూ ఫ్రాంటియర్ పరిధిలో పలు బోర్డర్ అవుట్ పోస్ట్ ల వద్ద బీఎస్ఎఫ్, పాక్ రేంజర్లు, ఎంతో స్నేహపూర్వక వాతావరణం మధ్య స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు’’ అని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. సాంబా, కథువా, ఆర్ఎస్ పుర, అక్నూర్ బోర్డర్ అవుట్ పోస్ట్ ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.

మరోవైపు దీపావళి మరుసటి రోజే మంగళవారం ఉదయం సాంబా వద్ద స్మగ్లింగ్ యత్నాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారు. 8 కిలోల హెరాయిన్ మాదక ద్రవ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్ల కాల్పులకు గాయపడ్డ స్మగ్లర్ తిరిగి పాక్ సరిహద్దులోకి పారిపోయాడు.