అంధకారంలో పుదుచ్చేరి ..

పుదుచ్చేరి వ్యాప్తంగా అంధకారంలో ఉండిపోయింది. ఆఖరికి పుదుచ్చేరి సీఎం ఇంటితో పాటు తమిళి సై ఇళ్లకు కూడా కరెంటు కట్ లేకుండా అయిపొయింది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి విద్యుత్తు పంపిణీ సంస్థను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 4 రోజులుగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో పుదుచ్చేరి వ్యాప్తంగా కరెంట్ నిలిచిపోయింది. సీఎం ఎన్‌.రంగస్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళసై సౌందర్‌రాజన్‌ ఇళ్లకూ కరెంట్‌ కట్‌ అయ్యింది. విద్యుత్తు పంపిణీ, రిటైల్‌ వ్యవస్థల్లో 100ు ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, కార్మిక సంఘాలు ముందు నుంచి తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. గత నెల 27న కేంద్ర ప్రభుత్వం పంపిణీ, రిటైల్‌లో 100ు ప్రైవేటీకరణకు బిడ్లను ఆహ్వానిస్తూ టెండర్‌ జారీ చేసింది.

దీంతో విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. మొదటి రెండు రోజులు సమ్మె ప్రభావం పెద్దగా కనిపించకున్నా.. శుక్రవారం నుంచి కోతలు ప్రారంభమయ్యాయి. శనివారం పుదుచ్చేరి వ్యాప్తంగా అంధకారం అలుముకుంది. ఓ వైపు విద్యుత్తు కార్మికులు, ఉద్యోగులు రోడ్డెక్కగా విద్యుత్తు కోతలతో విసిగిపోయిన ప్రజలు రోడ్లపై చేస్తున్న ఆందోళనలతో పుదుచ్చేరి అట్టుడికిపోతోంది. ప్రజల ఆందోళనలతో కరైకాల్‌-తిరువారూర్‌ మధ్య జాతీయ రహదారిపై ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. విపక్షాలు కూడా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ఒక్కసారిగా సరఫరా ఆగిపోవటంతో విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. కరెంట్‌ లేక పుదుచ్చేరి అంధకారంలో మునిగిపోయింది.