జనసేనలోకి వెళ్తున్నాననే వార్తల్లో నిజం లేదుః బాలినేని

ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ వెంటే ఉంటానని స్పష్టీకరణ

i-am-not-going-to-janasena-party-clarifies-balineni-srinivasa-reddy

అమరావతిః జనసేన పార్టీలోకి వైఎస్‌ఆర్‌సిపి సీనియర్‌ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్తున్నారనే ప్రచారం పై బాలినేని స్పందిస్తూ… ఈ వార్తల్లో నిజం లేదని చెప్పారు. తాను జనసేనలోకి వెళ్తున్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తనకు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ భిక్ష పెట్టారని… ఎన్ని కష్టాలు వచ్చినా తాను జగన్ వెంటే ఉంటానని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అధికారంలో ఉన్నా, లేకపోయినా తాను జగన్ వెంటే ఉంటానని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి రీజనల్ కోఆర్డినేటర్ గా జగన్ తనకు 22 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారని… ఆయా నియోజకవర్గాల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. 

పార్టీలో సమన్వయం కోసం తాను పని చేస్తున్నానని… ఇందులో భాగంగానే గిద్దలూరు నియోజకవర్గ వైసీపీ నేతలతో నిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశానని బాలినేని చెప్పారు. తాను ఊసరవెల్లి రాజకీయాలు చేయనని తెలిపారు. చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత గురించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తే… తాను మద్దతు ప్రకటించానని చెప్పారు. చేనేత కార్మికుల కోసం గతంలో కూడా ఎన్నో కార్యక్రమాలను చేశామని… ఇప్పుడు కూడా చేస్తామని తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/