విరసం నేత వరవరరావుకు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు

VARAVARARAO
VARAVARARAO

న్యూఢిల్లీః భీమా కోరెగావ్‌ కేసులో నిందితుడిగా ఉన్న విరసం నేత వరవరరావుకుసుప్రీం కోర్టు నేడు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. వైద్య కారణాలతో తనకు శాశ్వత బెయిల్‌ మంజూరు చేసేందుకు బొంబాయి హైకోర్టు నిరాకరించడాన్ని సవాల్‌ చేస్తూ వరవరరావు దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు యూయూ లలిత్‌, అనిరుద్ధ బోస్‌, సుధాన్షు ధూలియా ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విరసం నేత ఆరోగ్య పరిస్థితి, రెండున్నర సంవత్సరాల కస్టడీ కాలాన్ని ధర్మాసనం పరిగణలోకి తీసుకున్నది. ఈ కేసులో ఇంకా విచారణ ప్రారంభం కాలేదని, చార్జీషీట్‌ దాఖలు చేసినప్పటికీ అభియోగాలు కూడా నమోదు కాలేదని ధర్మాసనం పేర్కొంది. అయితే, ముంబైలోని ఎన్‌ఐఏ కోర్ట్‌ అనుమతి లేకుండా ఆయన గ్రేటర్‌ ముంబయిని దాటి వెళ్లకూడదని ధర్మాసనం వరవరరావుకు సూచించింది. అలాగే ఆయనకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదని, సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించకూడదని ధర్మాసనం స్పష్టం చేసింది. కేవలం వైద్యపరమైన కారణాలతోనే బెయిల్‌ను మంజూరు చేస్తున్నట్లు చెప్పింది.

కాగా, భీమా కోరెగావ్‌ కేసులో ఆగస్ట్‌ 28, 2018న వరవరరావును అరెస్టు చేశారు. అదే ఏడాది నవంబర్‌లో ముంబయిలోని తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/