హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రాబోతుంది

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ను మరింత అభివృద్ధి చేస్తూ వస్తుంది తెలంగాణ సర్కార్. ముఖ్యంగా ఐటీ సంస్థల ఫై ఫోకస్ చేసిన ఐటీ శాఖ..ఇప్పటికే ఎన్నో అగ్ర సంస్థలు హైదరాబాద్ లో తమ సంస్థలను నెలకొల్పేలా చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రాబోతుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌)కు చెందిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతుంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దీనికి సంబంధించి ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవశాస్త్రాలు(లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత దేశంలో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.

ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనం అన్నారు. తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సెన్సెస్ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన ముందడుగుగా ఈ కేంద్రం ఏర్పాటును భావించాలన్నారు. లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.