సంక్రాంతి వేళ కోడికత్తి గుచ్చుకొని యువకుడు మృతి

సంక్రాంతి అంటేనే బంధువుల సందడి..కోడి పందేలు , జూడాల సందడి ఇలా ఒక్కటేంటి అన్ని రకాల ఆటలతో హోరిత్తిస్తాయి. కోట్ల రూపాయిలు చేతులు మారుతుంటాయి. ముఖ్యముగా కోడి పందేలు సంక్రాంతి పండగ వేళ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈ పందేలు ఆడేందుకు చూసేందుకు పలు రాష్ట్రాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఏపీకి వస్తుంటారు. ఈ సంక్రాంతి కు కూడా అలాగే జరుగుతుంది.

కాగా తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి కోడిపందాల్లో విషాదంచోటుచేసుకుంది. కోడికత్తి గుచ్చుకొని పద్మారావు అనే యువకుడు మృతిచెందారు. కోడిపందాల బరిలో తొక్కిసలాట జరగడంతో పద్మారావుకు కోడికత్తి గుచ్చుకుంది. దీంతో పద్మారావు మృతిచెందారు.

మరోవైపు కోనసీమ వ్యాప్తంగా వందల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. చాలా గ్రామాల్లో రెండు నుంచి మూడు కోడిపందాల బరులు ఏర్పాటు చేసి జోరుగా పందాలు నిర్వహిస్తున్నారు. బరుల వద్దకు జోరుగా పందెం రాయళ్లు తరలివస్తున్నారు. ఇటు పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో గుండాట, గ్యాంబ్లింగ్‌ గేమ్‌పై నిషేధం కొనసాగుతుంది. కాకినాడలో పందేల్లో గెలిచిన కోడిపుంజు యజమానులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ఖరీదైన బైకులను బహుమతులుగా అందచేస్తున్నారు. దీంతో కాయ్ రాజా కాయ్ అంటూ ఊపు మీదున్నారు. ప్రజా ప్రతినిధులు కూడా పందాల్లో పాల్గొని.. మరింత ఉత్సాహం నింపుతున్నారు.