హైదరాబాద్ లో భారీగా తగ్గిన పోలింగ్

హైదరాబాద్ ఓటర్లు మరోసారి రాజకీయ పార్టీల నేతలకు షాక్ ఇచ్చారు. నిన్న సోమవారం జరిగిన లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు వారంతా దూరంగా ఉన్నారు. సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ సెంటర్ కు చేరుకొని..సామాన్య ఓటర్ల తో కలిసి క్యూ లైన్లో నిల్చుని ఓటు వేస్తే..నగర వాసులు చాలామంది ఇంటికే పరిమితమయ్యారు. హైదరాబాద్ సెగ్మెంట్ లో కేవలం 46 శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది.

ఇక మజ్లీస్ కంచుకోటలో ఇంత తక్కువ పోలింగ్ కావడం అసద్ కు ఆందోళన కలిగించే అంశమేనన్న టాక్ వినిపిస్తుంది. బీజేపీ అభ్యర్థికి తక్కువ పోలింగ్ పర్సంటేజ్ కలిసివచ్చే అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. 50 శాతం కన్నా తక్కువ పోలింగ్ నమోదు కావడంపై ఎంఐఎం శ్రేణుల్లోనూ టెన్షన్ వ్యక్తం అవుతోంది. హిందూ ఓటింగ్ అధికంగా ఉండే.. కార్వాన్‌, గోషామహాల్‌లో పోలింగ్‌ శాతం పెరగడం ఎంఐఎంను టెన్షన్ పెడుతోంది. కార్వాన్‌లో 51 శాతం, గోషామహాల్‌లో 49 శాతం పోలింగ్‌ నమోదైంది. అసద్‌కు పట్టున్న మలక్‌పేటలో పోలింగ్‌ తగ్గింది. ఆ నియోజకవర్గంలో కేవలం 38 శాతం పోలింగ్‌ మాత్రమే నమోదైంది. చాంద్రాయణగుట్టలో 45.19 శాతం, చార్మినార్‌లో 48.53 శాతం పోలింగ్ నమోదైంది. దీంతో హైదరాబాద్ లో ఎవరు విజయం సాదిస్తారనేది అందరిలో ఆసక్తిగా మారింది.