ఆంధ్ర ఓటర్లతో కిక్కిరిసిపోతున్న హైదరాబాద్ మెట్రో

నిన్న సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ కారణంగా నిన్నంతా హైదరాబాద్ ఖాళీగా కనిపించింది..ఈరోజు మళ్లీ బిజీ బిజీ గా మారింది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆంధ్ర ఓటర్లు తమ సొంత ఊర్లకు వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్ సగం ఖాళీ అయ్యినట్లు కనిపించింది. నిన్న ఓటు వేసిన వెంటనే కొందరు, నేడు మరికొందరు తిరుగుముఖం పట్టారు. దీంతో విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌కు దారితీసే రహదారులు కిక్కిరిసిపోయాయి. చాలాచోట్ల కిలోమీటర్ల కొద్దీ వాహనాల బారులు కనిపించాయి.

హైదరాబాద్‌కు శివారుకు చేరుకున్న ప్రజలు అక్కడి నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తుండడంతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మెట్రో ప్రాంగణాలు ప్రయాణికులతో రద్దీగా మారాయి. ముఖ్యంగా విజయవాడ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఎల్బీనగర్ వద్ద దిగి మెట్రో ఎక్కేస్తుండడంతో ఎల్బీనగర్-మియాపూర్ రూట్ ఒక్కసారిగా రద్దీగా మారింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఉదయం అరగంట ముందే అంటే 5.30 గంటలకే మెట్రో సేవలు మొదలయ్యాయి.