దేశంలో బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్..

హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఉండరు. సామాన్య ప్రజల దగ్గరి నుండి సినీ స్టార్స్ , క్రికెట్ దిగ్గజాలు , బిజినెస్ ప్రముఖులు ఇలా వారు వీరు అనే కాదు ప్రతి ఒక్కరు హైదరాబాద్ బిర్యానీ ని ఇష్టంగా తింటుంటారు. కాగా జులై 2న బిర్యానీ దినోత్సవం సందర్భంగా ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఫ్లాట్‌ఫాం స్విగ్గీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలోనే ఆన్‌లైన్‌లో బిర్యానీ ఆర్డర్లలో హైదరాబాద్ తొలి స్థానంలో ఉందని తెలిపింది. దీనికి సంబంధించిన డేటాను విడుదల చేసింది.

నగరవాసులు గత 6 నెలల్లో ఏకంగా 72 లక్షల బిర్యానీ ఆర్డర్లు చేయగా.. గడిచిన 12 నెలల్లో 150 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి. వీటిల్లో ధమ్ బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. ధమ్ బిర్యానీ ఆర్డర్లు 9 లక్షలు జరగ్గా.. బిర్యానీ రైస్ 7.9 లక్షలు, మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈ సారి బిర్యానీ ఆర్డర్లలో 8.39 శాతం వృద్ది కనిపించినట్లు స్విగ్గీ తెలిపింది. బిర్యానీ ఆర్డర్లలో కూకట్‌పల్లి తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో మాధాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని దాదాపు 15 వేల రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని అందిస్తున్నట్లు స్విగ్గీ చెప్పుకొచ్చింది. అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మాధాపూర్, కొత్తపేట, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు ఎక్కువగా బిర్యానీని ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది.