ఒడిశా మూడు రైళ్ల ప్రమాదం..మరో కీలక అధికారిపై వేటు

సౌత్ ఈస్టర్న్ రైల్వే జీఎం అర్చనా జోషిని తప్పించిన ప్రభుత్వం

General Manager of South Eastern Railway removed from her post after Balasore train accident

బాలాసోర్: ఒడిశాలో జరిగిన ఘోర రైల్వే ప్రమాదం తర్వాత ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకొంటోంది. ఓ వైపు సీబీఐ విచారణ జరుగుతుండగానే కీలక అధికారులపై వేటు వేస్తోంది. తాజాగా సౌత్‌ ఈస్టర్న్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అర్చనా జోషిపై ప్రభుత్వం వేటువేసింది. ఆమె స్థానంలో కొత్త జీఎంగా అనిల్‌ కుమార్‌ మిశ్రాను క్యాబినెట్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిటీ నియమించింది. బహనాగ బజార్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది. గత నెల 2న మూడు రైళ్లు ఢీకొన్న ఈ ఘటనలో 291 మంది మరణించారు. 1,100 మందికిపైగా గాయపడ్డారు.

ఈ ప్రమాద ఘటనపై కుట్ర కోణంలో సీబీఐ విచారణ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ ఘటనలో ఎస్‌ఈఆర్‌కు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులను రైల్వే బోర్డు తప్పించింది. వారిలో ఖరగ్‌పూర్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ శుజాత్‌ హష్మీ, ఎస్‌ఈఆర్‌ జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్‌ పీఎం సిక్దర్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ చందన్‌ అధికారి, ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనర్‌ డీబీ కేసర్‌, ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎండీ ఓవైసీ ఉన్నారు.