పిఠాపురంలో పెద్ద ఎత్తున బంగారం పట్టివేత

ఏపీలో మరో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చివరి రోజుల్లో పెద్ద ఎత్తున నగదు చేతులు మారతాయని ఎన్నికల సంఘం నిఘా పెంచింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నగదు పట్టుబడుతోంది. సరైన పత్రాలు లేని నగదు , బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలో రూ.17 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. బంగారానికి సరైన బిల్లులు కానీ, తీసుకుని వెళ్తున్న వ్యక్తుల వివరాలు కానీ సరిగా లేకపోవడంతో పాటు దానిని ఆక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎస్‌ఎస్‌టీ అధికారులు పట్టుకున్నారు.

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. శుక్రవారం రాత్రి పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద ఎస్‌ఎస్‌టీ బృందం తనిఖీలు చేపట్టింది. ఆ సమయంలో విశాఖ నుంచి కాకినాడ వస్తున్న సీక్వెల్‌ లాజిస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన వాహనం అనుమానస్పదంగా కనిపించింది. వెంటనే వాహనాన్ని ఆపి తనిఖీలు చేపట్టగా..అందులో బంగారు, వెండి వస్తువులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారానికి సరైన కాగితాలు కానీ, తరలించే వ్యక్తులు పేర్లు కానీ సరి లేకపోవడంతో అధికారులు బంగారంతో పాటు వాహనాన్ని కూడా సీజ్‌ చేశారు. ఏప్రిల్‌ 13న కూడా ఇదే తరహాలో రూ. 3 కోట్ల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరి ఆ బంగారం ఎవరిదీ..? ఎక్కడికి తీసుకెళ్తున్నారు..? తదితర విషయాలు తెలియాల్సి ఉంది.