కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ గా టీడీపీ అభ్యర్థి

మొత్తానికి కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. టీడీపీకి అనుకూలంగా 16మంది, వైసీపీ తరఫున 15 మంది సభ్యులు చేతులెత్తారు. దీంతో అధికారులు తెలుగుదేశం ఛైర్మన్ అభ్యర్థిగా చెన్నుబోయిన చిట్టిబాబును ప్రకటించారు. వైస్ ఛైర్మన్లుగా శ్రీనివాస్, శ్రీలక్షిల పేర్లను ప్రతిపాదించారు. హైకోర్టు ఆదేశాలు ఉండటంతో ఫలితాలు ప్రకటించలేదు.

రెండు రోజులుగా వరుసగా ఎన్నికను వాయిదా వేస్తూవస్తున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇవాళ హైకోర్టు ఆధేశాలతో తప్పనిసరిగా ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్ధితి వచ్చింది. ఎన్నిక నేపథ్యంలో మూడో రోజూ పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సుమారు 750మంది పోలీస్ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. ముళ్ల కంచెలు, బారికేడ్లను ఏర్పాటు చేసి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూసుకున్నారు. కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 29 వార్డులు ఉండగా… ప్రస్తుతం తెదేపా శిబిరంలో 15, వైకాపా శిబిరంలో 14మంది కౌన్సిలర్ల బలం ఉంది. తెదేపా ఎంపీ కేశినేని నాని, వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తమ ఎక్స్ అఫిషియో ఓట్లు వినియోగించుకోనున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లతో కలిపి తెదేపాకు 16, వైకాపాకు 15 మంది సభ్యులు మద్దతు ఇచ్చారు.