కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావుపై కేసు నమోదు

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. సవాళ్లు , ప్రతిసవాళ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ – బిఆర్ఎస్ – బిజెపి మధ్య వార్ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. కేవలం సభల్లో , సమావేశాల్లోనే కాదు , సోషల్ మీడియా వేదికగా కూడా వార్ నడుస్తుంది.

ఈ క్రమంలో కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ రావుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన సొంత సోషల్ మీడియా ఖాతాలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అనని మాటలను అన్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు, కాల్ రికార్డింగ్ సృష్టించి దుష్ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు. వెలిచాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, పోలీసులకు బీజేపీ నేత కొట్టె మురళీ క్రిష్ణ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కొట్టె మురళీ క్రిష్ణ ఫిర్యాదుపై కరీంనగర్ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.