తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న హిమాన్షు

సీఎం కేసీఆర్​ మనవడు, కేటీఆర్​ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు..తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు. మొదటిసారి బహిరంగ సభలో పాల్గొని , తన స్పీచ్ తో అందర్నీ ఆకట్టుకున్నాడు. తన సొంత నిధులతో హైదరాబాద్​లోని కేశవనగర్​లోని ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించిన హిమాన్షు.. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఈరోజు ప్రారంభించాడు. అనంతరం మాట్లాడిన హిమాన్షు.. కేసీఆర్ మనవడిగా ఏదైనా గొప్పగా, మంచిగా చేయాలన్నదే తన ఉద్దేశమని తెలిపాడు. మొదటిసారి ఈ పాఠశాలకు వచ్చినప్పుడు పరిస్థితులు చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయని తెలిపాడు.

ఈ రెండేండ్ల కాలంలో 20 నుంచి 30 సార్లు స్కూల్‌ను విజిట్ చేశాను. రాత్రి స‌మ‌యాల్లో వ‌చ్చి కూడా ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించాను. 2022లో క్లాస్ ప్రెసిడెంట్ అయిన‌ప్పుడు ఈ స్కూల్‌ను మా క్లాస్ కో ఆర్డినేట‌ర్ సూచ‌న‌తో విజ‌ట్ చేశాను. అంద‌రిలా కాకుండా.. ఎక్స్‌ట్రా ఆర్డిన‌రీగా చేయాల‌నుకున్నాను. ఎందుకంటే కేసీఆర్ మ‌నువ‌డ్ని క‌దా.. ఏదైనా నార్మ‌ల్‌గా చేసే అల‌వాటు లేదు. స్కూల్‌కు చుట్టూ గోడ‌లు క‌ట్టి గేట్లు ఏర్పాటు చేయాల‌ని మా క్లాస్ కో ఆర్డినేట‌ర్ సూచించారు. అలా స్కూల్‌ను విజిట్ చేసిన త‌ర్వాత ఇక్క‌డున్న ప‌రిస్థితుల‌ను చూసి చ‌లించిపోయాం. డైనింగ్ హాల్ ఏర్పాటు చేయాల‌నుకున్నాం.

తొలిసారిగా స్కూల్‌కు వ‌చ్చిన‌ప్పుడు 10 వేల మొక్క‌లు నాటాం. ఈ కార్య‌క్ర‌మంతో సంతృప్తి లేదు. చెట్లు పెట్టే కార్య‌క్ర‌మం ఎవ‌రైనా చేస్తారు.. మ‌నం కొత్త‌గా చేయాల‌ని చెప్పాను. స్కూల్‌కే ఒక పేరు తేవాల‌నుకున్నాం. క్లాస్ రికార్డులో బెంచ్ మార్క్ సెట్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాం. స్కూల్ కండీష‌న్ చూసిన త‌ర్వాత ఆ బాధ‌ను మాట‌ల్లో చెప్పుకోలేక‌పోయాం. క‌ళ్ల‌ల్లోకి నీళ్లు వ‌చ్చాయి. పేద‌రికాన్ని అరిక‌ట్టే ఉపాయం చదువుకున్న స‌మాజానికి ఉంటుంద‌ని మా తాత ఎప్పుడూ చెప్పేవారు. నా చ‌దువులో గ్రేడ్ త‌గ్గినా.. వంద మందికి మంచి చేసే అవ‌కాశం ఉంటే చేయాల‌ని నాన్న కూడా చెప్పారు. మా తాత ప్రేర‌ణ‌, మా నాన్న ఆశీస్సుల‌తో ఈ స్కూల్‌లో చాలా కార్య‌క్ర‌మాలు చేశాం. ఈ స్కూల్లో చ‌దివే పిల్ల‌లంద‌రూ పేదవారు. కూలీ ప‌నులు చేసుకునే కుటుంబాల‌కు చెందిన‌వారే. ఈ స్కూల్ పిల్ల‌ల్లో ఫ్యూచ‌ర్‌లో ఇంజినీర్ల‌ను, డాక్ట‌ర్ల‌ను, లాయ‌ర్ల‌ను చూడాలి. మీలో పొలిటిషీయ‌న్ల‌ను చూడాలి. మీరంతా చాలా ఎద‌గాల‌ని కోరుకుంటున్నాను. మా విజ‌న్‌ను కంటిన్యూ చేయండి. భ‌విష్య‌త్‌లో కూడా త‌ప్ప‌కుండా అండ‌గా ఉంటాం అని హిమాన్షు స్ప‌ష్టం చేశారు. హిమాన్షు స్పీచ్ విని అంత ఆశ్చర్యపోయారు. తాతకు తగ్గ మనవడు అని అంత మాట్లాడుకున్నారు.