నూహ్‌లో ఆక్రమణల కూల్చివేతపై హైకోర్టు స్టే

high-court-stays-demolition-drive-in-violence-hit-nuh-in-haryana

చండీగఢ్‌: హర్యానా రాష్ట్రంలోని నూహ్‌ జిల్లాలో కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్టే విధించింది. నూహ్‌ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు ముందుగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఘటనపై కేసు నమోదు చేసి పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.

అందులో భాగంగా ఈ మధ్య ఒక రెస్టారెంట్‌ను కూడా అధికారులు కూల్చివేశారు. ఒక వర్గానికి చెందిన కొంత మంది రౌడీలు, గూండాలు ఆ రెస్టారెంట్‌ పైనుంచి మరో వర్గం ర్యాలీపై రాళ్లు విసరడం ద్వారానే నూహ్‌లో మత ఘర్షణలు మొదలయ్యాయని, అది అక్రమ నిర్మాణమని తేలడంతో దాన్ని కూడా కూల్చివేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో తాము డబ్బులు పెట్టి కొనుగోలు చేసిన ఇళ్లను కూల్చివేస్తున్నారని కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన పంజాబ్‌ అండ్‌ హర్యానా హైకోర్టు నూహ్‌లో ఆక్రమణల కూల్చివేతపై స్టే విధించింది. దాంతో తక్షణమే కూల్చివేతలను నిలిపివేయాలని నూహ్‌ పట్టణ డిప్యూటీ కమిషనర్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను ఆదేశించారు. దాంతో అధికారులు వెంటనే కూల్చివేతలను నిలిపివేశారు.

మరోవైపు నూహ్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం చోటుచేసుకున్న అల్లర్లకు సంబంధించి పలువురు రోహింగ్యా వలసదారులను పోలీసులు అరెస్టు చేశారు. జులై 31న నూహ్‌లో ఓ మతపరమైన ఊరేగింపుపై రాళ్లదాడి ఘటనలో రోహింగ్యాలు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. తాము సేకరించిన ఆధారాల ద్వారా రాళ్లదాడి ఘటనలో పాల్గొన్నవారిని గుర్తించినట్లు తెలిపారు. వాటి ఆధారంగా నిందితులను అరెస్టు చేస్తున్నట్లు నూహ్‌ జిల్లా పోలీసు అధికారి నరేంద్ర బిజార్నియా వెల్లడించారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితులు అదుపులో ఉండటంతో సోమవారం కూడా నాలుగు గంటలపాటు కర్ఫ్యూ సడలించినట్లు నూహ్‌ డిప్యూటీ కమిషనర్‌ ధీరేంద్ర ఖడ్‌గతా తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపారు. ఇప్పటిదాకా ఈ అల్లర్లకు సంబంధించి 56 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుకాగా, 147 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.