వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట

supreme-court-stay-on-ts-high-court-judgement-in-kothagudem-mla-issue

న్యూఢిల్లీః వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వనమా శాసనసభ్యత్వం అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ సందర్భంగా.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం సుప్రీం కోర్టు.. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఇటీవలే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వనమా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.

కాగా, 2018లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వనమా పోటీ చేశారు. బిఆర్ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై 4వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్‌లో వనమా తప్పడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో జలగం వెంకటరావు వనమాపై పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విచారణ చేపట్టిన హైకోర్టు జులై 25న వనమాను అనర్హుడిగా ప్రకటిస్తూ తీర్పు నిచ్చింది. జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీర్పుపై స్టే కోరుతూ తొలుత వనమా హైకోర్టునే ఆశ్రయించారు. కోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లారు.