ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై హైకోర్టు స్టే

ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై హైకోర్ట్ స్టే విధించింది. కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహాం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇస్కాన్‌, యాదవ సంఘాలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నతన్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టొద్దని స్టే విధించింది. పువ్వాడ అజయ్‌ సహా నిర్వాహకులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఏర్పాటు చేయాలనుకున్నారు. మొత్తం రూ.4 కోట్లతో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలనుకున్నారు. ఇప్పటీకే విగ్రహ ఏర్పాట్లు పూర్తి కావడమే కాదు , విగ్రహ ఆవిష్కరణ కు సంబంధించి ఆహ్వానాలు సైతం వెళ్లాయి. ఈ క్రమంలో శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం రూపొందడంపై శ్రీకృష్ణ జాక్, ఆదిబట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో 14 పిటిషన్స్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు..విగ్రహం ఏర్పాటుపై స్టే విధించింది.