తెలంగాణ ప్రజలు ఆదరణ చూపారు

అందుకే టిఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించిందన్న సిఎం కెసిఆర్‌

CM KCR
CM KCR

హైదరాబాద్‌: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధించడం పట్ల సిఎం కెసిఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన ఫలితాల సరళిపై మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ జిల్లా ఆ జిల్లా అని తేడా లేకుండా 360 డిగ్రీస్ లో టిఆర్‌ఎస్‌ పార్టీపై నమ్మకం ఉంచారని ఫలితాలు చూస్తే అర్థమవుతుందని అన్నారు. గత ఆరేళ్లుగా తాము అమలు చేస్తున్న పథకాలను, అవలంబిస్తున్న విధానాలను ప్రజలు అద్భుతంగా బలపరిచారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయడం ద్వారా, ఎవరెన్ని అన్నా పట్టించుకోకుండా మీరు నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా ప్రయాణించండి అని తమకు దిశానిర్దేశం చేశారని వివరించారు. మేం పాటిస్తున్న 100 శాతం లౌకిక విధానం కానీ, కులాలు, మతాల విషయంలో సమాదరణ కానీ, అందరినీ కలుపుకునిపోయే పద్ధతి కానీ ప్రజలకు బాగా నచ్చిందని ఈ సందేశం ద్వారా అర్థమవుతుంది. ఇటువంటి ప్రబలమైన తీర్పునిచ్చిన తెలంగాణ ప్రజానీకానికి వ్యక్తిగతంగా, పార్టీ పరంగా శిరసు వంచి నమస్కరిస్తున్నా అంటూ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/