నేడు కుప్పంలో పర్యటించనున్న సిఎం జగన్

అమరావతిః సిఎం జగన్ నేడు కుప్పం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి వెళ్తుండడంతో ఇప్పుడు అన్ని కళ్లు అటు వైపే చూస్తున్నాయి. ఇక వైఎస్‌ఆర్‌సిపి క్యాడర్ కూడా సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కుప్పం నిండా పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సీఎం కటౌట్లు, బ్యానర్లే కనిపిస్తున్నాయి. దీంతో సీఎం జగన్ చిత్తూరు జిల్లా కుప్పం టూర్ హాట్ టాపిక్‌గా మారింది. టిడిపిని ఓడించడమే లక్ష్యంగా కొంత కాలంగా అండర్ గ్రౌండ్ వర్కచేస్తున్న వైఎస్‌ఆర్‌సిపి.. మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. మూడో విడత వైఎస్‌ఆర్ చేయూత నిధుల విడుదల సందర్భంగా ఇవాళ సీఎం జగన్ కుప్పంకు వస్తున్నారు. పథకం లబ్ధిదారులకు మూడో విడత నిధులను సీఎం విడుదల చేస్తారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.
రాష్ట్రంలోని 26 లక్షల 39 వేల మంది మహిళలకు దాదాపు 5వేల కోట్ల క్యాష్‌ను మూడోవిడత చేయూత కింద బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. చిత్తూరు జిల్లాలోని లక్షా 2వేల మంది లబ్దిదారులకు 192 కోట్లను ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇక కుప్పంలో చేపట్టే పలు అభివృద్ది పనులకు శంకుస్తాపన చేస్తారు. ఇవాళ ఉదయం 9గంటలకు గన్నవరం నుంచి కుప్పంకు బయలు దేరుతారు సీఎం జగన్. 11 గంటలకు కుప్పం చేరుకునే సీఎం..12- ఒంటి గంట మధ్య బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.20 గంటలకు కుప్పం నుంచి బయలుదేరి 3.10 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. అయితే.. సీఎం నిన్ననే కుప్పంకు రావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల ఇవాళ రావాల్సి వస్తోంది. దీంతో పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/