గిరిజన జాతర మేడారంకు హెలికాప్టర్‌ సేవలు

Helicopter services to tribal jatara Medaram

వరంగల్‌ః ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం కు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాల్లో హెలికాప్టర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ ఎప్పటిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం చేస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరలు రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలుస్తున్నది.

కాగా, మేడారం జాతర బుధవారం నుంచి ప్రారంభంమైంది. మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు. ఈ ఆదివాసీ వేడుక బుధవారం ఉదయం నుంచి గురువారం వేకువజాము వరకూ జరుగుతుంది. మేడారంలోని సమ్మక్క దేవత పూజామందిరం, కన్నెపల్లి సారలమ్మగుడి, పూనుగొండ్ల, కొండాయి గ్రామాల్లో పగిడిద్ద రాజు, గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి.

పూర్వకాలంలో ఈ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. రెండేళ్లకు ఇవి పాతబడి పోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు (చెట్టుకొమ్మలు), వాసాలు, గడ్డి తీసుకొచ్చి కొత్త గుడి నిర్మించి పండగ జరుపుకునేవారు. దీనినే మండమెలిగే పండగ అంటారు. ఇందులో భాగంగా పూజారులు పగలంతా తలో పని చేసి, రాత్రంతా దేవతల గద్దెలపై జాగారం చేస్తారు.