మరోసారి సరిహద్దుల్లో పాకిస్థాన్‌ డ్రోన్లు కలకలం..ఆర్మీ కాల్పులు

army-opens-fire-at-pak-drone-spotted-near-border-in-jammu-and-kashmir

న్యూఢిల్లీః మరోసారి పాకిస్థాన్‌ డ్రోన్లు జమ్మూ కశ్మీర్‌ సరిహద్దుల్లో కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పూంచ్‌ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాక్‌ డ్రోన్లు ఎగిరాయి. నియంత్రణ రేఖ వద్ద రక్షణగా ఉన్న ఆర్మీ దళాలు వాటిని గుర్తించి కాల్పులు జరిపినట్టు అధికారులు తెలిపారు. మెంధార్‌లోని బల్నోయి గుల్పూర్‌ సెక్టార్స్‌ పై పాక్‌ డ్రోన్లు కొద్దిసేపు ఎగిరినట్లు అధికారులు తెలిపారు. సైనికుల కాల్పుల తర్వాత ఆ డ్రోన్లు పాకిస్థాన్‌ వైపు తిరిగి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. దీంతో వెంటనే భద్రతా బలగాలు ఆయా ప్రాంతాల్లో సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టినట్లు చెప్పారు.

కాగా, ఈ నెల12న మెంధార్‌ సెక్టార్‌లోని మాన్‌కోట్ ప్రాంతంలోనూ పాక్ డ్రోన్ కదలికలను గుర్తించిన ఆర్మీ దళాలు దానిపై కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్‌లోకి మాదక ద్రవ్యాలు, ఆయుధాలను చేరవేసేందుకు పాకిస్థాన్ డ్రోన్‌లను ఉపయోగిస్తోంది. దీంతో అలర్ట్ అయిన జమ్మూ కాశ్మీర్ పోలీసులు.. పొరుగు దేశం నుంచి ఆయుధాలు, మాదకద్రవ్యాలను తీసుకొచ్చే డ్రోన్‌లను గుర్తిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారికి రూ.3 లక్షల నగదు బహుమతిని కూడా ప్రకటించారు.