జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ నివాసంలో సీబీఐ సోదాలు

CBI raids J&K ex-governor Satyapal Malik’s premises in hydroelectric project case

న్యూఢిల్లీః జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. కిరు హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టు అవినీతి కేసులో తనిఖీలు నిర్వహిస్తున్నారు. 30 చోట్ల ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. ఉదయం ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్లో దాదాపు 100 మంది అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కిరు హైడ్రో ఎలెక్ట్రిక్ ప్రాజెక్టుకు చెందిన సివిల్ పనుల కేటాయింపుల్లో రూ. 2,200 కోట్ల విలువైన అవినీతి జరిగిందని కేసు నమోదయింది.

2018 ఆగస్ట్ నుంచి 2019 అక్టోబర్ వరకు జమ్మూకశ్మీర్ గవర్నర్ గా సత్యపాల్ మాలిక్ ఉన్నారు. ఆ సమయంలో తన వద్దకు రెండు ఫైల్స్ వచ్చాయని… వాటిపై సంతకం చేస్తే రూ. 300 కోట్లు వస్తాయని తన సెక్రటరీలు చెప్పారని… అందులో హైడ్రో ప్రాజెక్టుది ఒక ఫైల్ అని గతంలోనే ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈరోజు జరుగుతున్న సోదాలపై సత్యపాల్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ… అనారోగ్య కారణాలతో తాను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని చెప్పారు. తాను అనారోగ్యంతో ఉన్నప్పటికీ… నిరంకుశ శక్తులు తన నివాసంపై దాడులు చేస్తున్నాయని మండిపడ్డారు. తన డ్రైవర్ ను, సహాయకుడిని వేధిస్తున్నారని అన్నారు. ఇలాంటి వాటికి తాను భయపడనని చెప్పారు. రైతులకు తాను అండగా ఉంటానని అన్నారు.