వరంగల్‌ లో 34 కాలనీలు జలమయం..

అల్పపీడన ప్రభావం తో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ లో గత నాల్గు రోజులుగా భారీ నుండి అతి భారీ వర్షాలు పడుతుండడం తో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. మేఘాలకు చిల్లు పడిందా..అన్నట్లు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో రాష్ట్రంలోని వాగులు , వంకలు పొంగిపొర్లుతున్నాయి.

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. హనుమకొండ, జనగామ, వరంగల్‌లో కొన్ని చోట్ల, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మహబూబాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసినట్టు తెలిపింది. నిజామాబాద్‌ జిల్లా వెల్పూర్‌లో అత్యధికంగా 40 సెం.మీ, జక్రాన్‌పల్లి, భీంగల్‌ 23, వరంగల్‌ జిల్లా సంగెం 22, నెల్లబల్లిలో 17, హనుమకొండ జిల్లా ఆత్మకూర్‌ 17, జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ 16, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ 14, సాయంపేట, పరకాల, మోర్తాడ్‌, ఆర్మూర్‌లో 14, వరంగల్‌ జిల్లా పర్వతగిరి, ములుగులో 13, బోనకల్‌, పాలకుర్తి, డోర్నకల్‌లో 12, చెన్నారావుపేట, శ్రీరాంపూర్‌, కూసుమంచి, మహబూబాబాద్‌లో 11సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఇక వరంగల్ లో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారయంత్రాంగం పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరంలోని 34కిపైగా కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరంగల్‌లోని డీకేనగర్‌, ఎస్‌ఆర్‌నగర్‌, అండర్‌ రైల్వే గేట్‌, హాంటర్‌రోడ్డు, సంతోషిమాత కాలనీలు జలమయం అయ్యాయి.

ఇక ఏపీ విషయానికి వస్తే..అనకాపల్లి, అల్లూరి, విశాఖ, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కరుస్తున్నాయి. నిన్న అనకాపల్లి జిల్లాలో 12.9 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. రానున్న రెండు రోజులు ఏపిలో వర్షాలు కురిసే నేపధ్యంలో మత్స్యకారులకి వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.