రెండు రోజుల్లో పండంటి బిడ్డకు జన్మనివ్వనున్న గర్భిణీ ఆత్మహత్య

సత్యసాయి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరో రెండు రోజుల్లో పండండి బిడ్డ కు జన్మనివ్వాల్సిన గర్భిణీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కదిరి మున్సిపల్ పరిధిలోని కుటాగుళ్ల గ్రామంలో చోటుచేసుకుంది. 36వ వార్డు వాలంటీరుగా విధులు నిర్వహిస్తున్న అశ్విని (28) తొమ్మిది నెలల నిండు గర్భిణి. ఈ నెల 27న ఆమెకు డెలివరీ డేట్ ఇచ్చారు వైద్యులు. ఈ తరుణంలో భార్యా భర్తల మధ్య జరిగిన గొడవతో అశ్విని పుట్టింటికి వచ్చింది. భర్తతో జరిగిన గొడవతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరింది. కుటుంబ సభ్యులు విషయం తెలుసుకుని హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి చెందింది. విష్ణువర్ధన్ తో ఐదేళ్ల కిందట అశ్విని కి వివాహం జరిగింది. అశ్విని కి రెండేళ్ల కొడుకు ఉండగా ఇప్పుడు తొమ్మిదో నెల గర్భిణి. భర్త వేధింపులతోనే తమ బిడ్డ బలవన్మరణానికి పాల్పడిందని అశ్విని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లైన కొద్ది రోజుల నుంచి తరచూ వేధించడం, కొట్టడంతో అశ్విని విసిగి తనువు చాలించిందంటున్నారు. భర్త, అత్తమామలు కలిసి తమ బిడ్డను పొట్టనపెట్టుకున్నారని, వారిని శిక్షించాలి అంటూ మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.