ఈ విషయంలో సీఎం జగన్ కు క్షమాపణలు చెపుతున్నాః పిల్లి సుభాష్ చంద్రబోస్

చెల్లుబోయినకు టికెట్ ఇస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్న బోస్

Pilli Subhash Chandra Bose
Pilli Subhash Chandra Bose

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బోస్ జనసేనలో చేరుతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. మరోవైపు చెల్లుబోయినకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో సుభాష్ చంద్రబోస్, ఆయన కుమారుడు సూర్యప్రకాశ్ తో ఎంపీ, రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి నిన్న రెండు గంటలకు పైగా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారిని మిథున్ రెడ్డి బుజ్జగించారు.

ఈ క్రమంలో మీడియాతో పిల్లి బోస్ మాట్లాడుతూ… కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్లినప్పుడు వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపిని వీడుతానని తాను ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని మాత్రమే తాను అన్నానని చెప్పారు. ఎంతో బాధతో ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు. ఈ విషయంలో సీఎం జగన్ కు తాను క్షమాపణలు చెపుతున్నానని తెలిపారు.