రాబోయే రెండు రోజులు తెలంగాణ లో భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రానికి చల్లటి కబురు తెలిపింది వాతావరణ శాఖ. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షదీప్‌ ప్రాంతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మధ్య అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, కర్నాటక, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేగాక ఉరుములు మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది.
మంగళవారం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో మూడు గంటలపాటు వర్షం దంచికొట్టింది. కొన్ని చోట్ల తేలికపాటిగా, అక్కడక్కడ భారీ వర్షం పడింది.

శేరిలింగంపల్లి, లింగంపల్లిలో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. వచ్చే మూడు రోజులు హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నల్లగొండ, సూర్యాపేట, నారాయణపేట, రంగారెడ్డి జిల్లాలతోపాటు మేడ్చల్‌-మల్కాజిగిరి, వరంగల్‌, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లోనూ అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.