తెలంగాణవాసులకు పిడుగు లాంటి వార్త..

తెలంగాణ ప్రజలకు మరో పిడుగు లాంటి వార్త తెలిపింది వాతావరణ శాఖ. ఇప్పటీకే అకాలవర్షాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుండగా.. తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం శనివారం (మే 6) సాయంత్రం హెచ్చరించింది.

హైదరాబాద్‌ సహా ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల కంటే ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. గంటకు 41 నుంచి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

మే 6వ తేదీ ఉదయం ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది సముద్ర మట్టం నుంచి మధ్య ట్రోపోస్పియర్‌ స్థాయి వరకు కొనసాగుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో ఈనెల 8వ తేదీన ఉదయం అదే ప్రాంతంలో అల్పపీడన ప్రదేశం ఏర్పడే అవకాశముందని, ఇది మరుసటి రోజున వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.