వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన ఏపీ సీఎం

రైతులకు వైస్సార్ రైతు భరోసా పథకం ద్వారా జగన్ సర్కార్ తోడుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో రూ.4 వేల సాయాన్ని అందజేస్తున్న జగన్.. వరుసగా నాలుగో ఏడాది రెండో విడతగా వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయాన్ని అందజేశారు. సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసారు. 50.92 లక్షల మంది రైతన్నల బ్యాంక్‌ ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేసారు. రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందిస్తోంది. రైతు భరోసా మొదటి విడతగా మే నెలలో రూ.7,500.. రెండవ విడతగా అక్టోబర్‌లో రూ.4వేలు.. మూడో విడతగా జనవరిలో రూ.2,000 అకౌంట్‌లలో జమ చేస్తోంది.

ఇక వైస్సార్ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ఆళ్లగడ్డకు చేరుకున్న‌ సీఎం జగన్‌కు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, వైస్సార్సీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం.. రైతులతో ముచ్చటించారు. వారితో ఫొటో దిగారు. సభా వేదికపై దివంగత మహానేత వైస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.