గుడివాడ లో టెన్షన్ వాతావరణం : టీడీపీ – వైస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు గుడివాడ పర్యటన లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు పర్యటనను వైస్సార్సీపీ శ్రేణులు అడ్డుకోవడం తో ఘర్షణ తలెత్తింది. స్థానిక వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కార్యాలయం వద్ద టీడీపీ పార్టీ కార్యకర్తలు, వైస్సార్సీపీ కార్యకర్తలు.. పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని చెదరగొట్టారు. ఎవరైనా కవ్వింపు చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ రెండు పార్టీలకు చెందిన బృందాలు ఒకర్నొకరు ఎదురుపడకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎన్‌ఎస్‌జీ బలగాలను కూడా మొహరించారు.

కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు.. గుడివాడ నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. రామనపూడి వద్ద గుడివాడ నియోజకవర్గంలోకి చంద్రబాబు రోడ్‌ షో ఎంటర్ అవ్వగానే… టీడీపీ నేతలు రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము, పిన్నమనేని వెంకటేశ్వరరావు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు రోడ్‌ షోకు పెద్ద సంఖ్యలో జనం, టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. టీడీపీ శ్రేణులు ర్యాలీగా చంద్రబాబు రోడ్‌షోను అనుసరించారు. . అంతకు ముందు బసవతారకం పుట్టినూరు కొమురవెల్లిలో ఎన్టీఆర్‌ దంపతుల విగ్రహాలకు చంద్రబాబు నివాళి అర్పించారు. అనంతరం నిమ్మకూరు నుంచి భారీ ర్యాలీగా గుడివాడ బయలుదేరారు. గుడివాడలో కోతి బొమ్మసెంటర్, బస్ స్టాండ్ సెంటర్ మీదుగా చంద్రబాబు రోడ్‌ షో మొదలైంది. టీడీపీ అధినేతకు పార్టీ శ్రేణులు భారీ గజమాలతో స్వాగతం పలికాయి.