జీతాలు పెంచాలని కార్మికులు ధర్నా చేస్తే..గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది – హరీష్

ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..గతంలో జీతాలు పెంచాలని ధర్నా చేస్తే ఇనుప బూట్లు, గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన 44 కార్మిక సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న హరీష్ రావు..ఈ సందర్బంగా మాట్లాడుతూ.. కార్మికులకు, రవాణా కార్మికుల ట్రాన్స్‌పోర్ట్ బోర్డు ఏర్పాటు డిమాండ్‌ని మూడోసారి అధికారంలోకి రాగానే నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ బీఆర్ఎస్‌ని గెలిపిస్తే ఆర్పీలు, వీఏవోల జీతాన్ని రెట్టింపు చేస్తామని అన్నారు.

కనీస వేతన సవరణ కచ్చితంగా చేస్తామని, అంగన్ వాడీలా సమస్యలు తీర్చుతామన్నారు. కోటి కుటుంబాలకు కేసీఆర్ బీమా సౌకర్యం చేపడుతున్నామని, ఏ కారణం చేతైన ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇంటి మహిళకు వారం రోజుల్లో 5 లక్షల భీమా డబ్బులు జమ చేస్తామని తెలిపారు. కార్మికుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ. రైల్వేలు, రైల్వే లైన్లు, బీఎస్ఎన్ఎల్, ఎల్ఐసీలను అమ్మేశారని ఆరోపించారు. అమ్ముడు తప్ప కొత్తగా కంపెనీలు, ఫ్యాక్టరీలు పెట్టడం బీజేపీకి తెలియదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగుల జీతాలు ఎక్కువ అని ఈ సందర్బంగా గుర్తు చేసారు.